Wednesday, November 12, 2008

పిల్లలు నిద్దరోతున్నారు

రివ్వని కొట్టే శీతాకాలపు చలిగాలులు

తలుపు తట్టకుండానే వెనక్కు మళ్ళుతాయి

ఘుమ్మని వాసన జల్లే మల్లె మొగ్గలు

కిటికీలోంచి మెల్లిగా తొంగి చూస్తాయి

ఘల్లని కదిలే పెరటి చెట్ల ఆకులు

చప్పుడు చేయవద్దని గుస గుసలాడుతాయి

రైయ్యని ఎగిరే గాలి పటాలు

ముందు గదిలో నిశ్శబ్దంగా వేచివుంటాయి.

శీతాకాలపు రాత్రి

ఎంత దూరం నడచినా
వెచ్చని ఇల్లు దాపులో కనిపించదు.
దట్టమైన చీకటి తెర
దారిని మూసి వేస్తుంది
జోరుగా వీచే శీతగాలి
జుట్టుని చెదర గొడుతుంది


ఎంత దూరం నడచినా
నిప్పు సెగ జాడే కనిపించదు
చల్లని మంచు గాలి
ఛళ్ళని కొడుతుంది
కరకరమని మంచు పొడి
కాళ్ళ కింద కరిగిపోతుంది


ఎంత దూరం నడచినా
వెచ్చని భోజనం వాసనే సోకదు
చుట్టూ పరుచుకున్న మంచు గుట్ట
చచ్చేంత ఆకలి పుట్టిస్తుంది
ఒళ్ళు విరుచుకున్న మంచు పులి
ఒంటరి బాటసారిని ఆబగా వెంటాడుతుంది.