Monday, October 20, 2008

క్లేశం

సన్న ఇసుక పైకిలేచి
సుళ్ళు తిరిగి ఎగురుతుంది
ఆకాశం ఉన్నట్టుండి
అనేక రంగులు మారుస్తుంది

జోరుగాలి బలంగా
ఝాడించి ముందుకు నెడుతుంది
కాళ్ళ కింద ఇసుక
కదిలి జారిపోతుంది

చెవుల నిండా ధూళి
చేరి నిండుకుపోతుంది
ఏదో ఒక ఇసుక రేణువు
ఎగిరి కళ్ళల్లో దూరుతుంది

ఆ గొడవలో,దుమ్ము కింద కప్పడి
ఆత్మ కనిపించకుండా పోతుంది.

తారామతి బిరాదరి

పేరు తెలియని చెట్టు ఒకటి

వానకు తడుస్తూ నిలబడిఉంది

దూరాన,ఎన్నడో మరణించిన

నాన్న గొంతు వినబడుతోంది

ఆదరా బాదరా ఓ యువతి

బిరాదరిలోకి పరిగెడుతోంది

ఎక్కడినించో తారామతి పాట

రెక్కలార్చుతూ వరండాలో వాలుతోంది

మబ్బు కొప్పులోంచి నీళ్ళ దండ

జారి చెట్ల కొమ్మల్లో చిక్కుకుంటోంది

గత రాత్రంతా నిద్రించని ఈ దేహాన్ని

అన్ని వైపులా నుండి ఏవో అదృశ్య హస్తాలు

ఊపేస్తున్నట్టుగా అనిపిస్తోంది.